ఎవ్వరూ ఏ యుద్దాలు గెలవ లేదు, ఏ రాక్షసుడు చావలేదు
ఇది దేవుళ్ళ పండగ కాదు, ఇది ప్రకృతి పండుగ, రైతుల పండగ,
రంగురంగుల రధం ముగ్గుల పండగ, ఇంటికి వచ్చిన కొత్త దాన్యం తో అరిసెలు చేసుకునే పండగ
మేడలో పిల్లలు గుడిసెలో పిల్లలు భోగిమంట చుట్టూ చేరి చలికాచుకునే పండగ
కొత్త పరికిణీలలో అమ్మాయిలు, కొత్త చొక్కా, లాగుల్లో అబ్బాయిలు కలసి దాగుడు మూతలు ఆడుకునే పండగ
సోది అమ్మాయి చెప్పే సోది, హరిదాసు పాడే పాటలు, డుడు బసవన్న డప్పుల పండగ
అమ్మాయిలు మట్టిగాజులు కొంటుంటే, అబ్బాయిలు గాలి పటాలకి విరిగిన గాజుముక్కల్ని నూరే పండుగ
ఎడ్లకి పరుగు పందాల పండుగ, ఆవులకి అందాల పోటీల పండుగ
బారులుగా కొలువులు తీరిన బొమ్మల పండుగ, చుట్టాలతోవాకిళ్ళు కళకళలాడే పండగ
చిన్నా పెద్దా కలిసి ఊరంతా చేసుకునే పెద్ద పండుగ, ఇది నాకు ఇష్టం అయిన పండుగ.