1st Prize - నా ప్రాణస్నేహితుడికి సంక్రాంతి శుభాకాంక్షలు - Pavani Tanikella
ప్రచురించబడిన తేది : 16-Nov-21
పొద్దున లేచిన వెంటనే నీతో మాకు అవసరం వుంది,
(కానీ ఆ సమయంలో నువ్వు మాత్రం గుర్తుకు రావు)
యే పూజ ముందైనా నీ ఆవశ్యకత ఎంతో వుంది,
(కానీ...)అన్నం కంచంలో పెట్టుకున్నాక, మొదటి ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకునేలోపు వున్న కొద్ది సమయంలో తలుచుకోవాల్సిన పేరు నీది.(కానీ...)
భోగి పండుగ రోజు భోగి మంటలు వేసి సంక్రాంతి రోజు అమ్మ చేతి పొంగలి తిని దేవుడికి కుదిరితే ఒక దండం పడేసి అదే పండగ అనుకునే మాకు అసలు సంక్రాంతి సంబరమంతా నీ నుంచే ప్రారంభమవుతుందని చిన్నప్పుడు చదువుకున్న గుర్తు. (కానీ...)
రోజుకి ఎనిమిది గంటలు పని చేసి నెల చివర జీతమొచ్చిందా అని లెక్కలు తెలిసిన మాకు, నువ్వు ఎండననక వాననక నొప్పనక రొప్పనక నెలకింతని ఆదాయంరాక మన అందరి కోసం కష్టపడుతున్నావని తెలుసు.(కానీ...)
చిన్న పని చేసినా ఎదుటి వారు గుర్తించాలి, మనస్ఫూర్తిగా అభినందించాలి అని మాకు ఎలా అనిపిస్తుందో, యే మాత్రం ప్రత్యుపకారం ఆశించక పలువురి చేత మాటలు పడి, వెన్ను తట్టే నీడ లేక నువ్వు కుమిలిపోతున్నావనితెలిసినా (కానీ...)
ఈ పండుగ రోజున అన్నం పెట్టే నీ చేతులు చల్లగా ఉండాలని,నీ సాయం పొందే మాకు నిన్ను వెన్నుతట్టే ఆలోచన రావాలని నీ ఋణం తీర్చుకునే రోజు ఒకటి వస్తుందని ఆశగా ఎదురు చూస్తాం.అన్ని సమయాల్లో నిన్ను గుర్తుపెట్టుకోగలిగే అద్భుతమైన జ్ఞాపక శక్తి మాకు రావాలనిప్రాణస్నేహితుడివని చెపుతున్నా ఓ రైతు, నా ప్రాణ స్నేహితుడా,నీకు సంక్రాంతి శుభాకాంక్షలు